విశాఖలో దారుణం.. టీడీపీకి ఓటేశారని విచక్షణారహితంగా దాడి..

Spread the love

ఎన్నికల ముగిసి 72 గంటలు గడిచినా ఏపీలో దాడులు మాత్రం ఆగడం లేదు. పల్నాడు, తాడిపత్రి ఘటనలు మరవకముందే విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు ఇద్దరు మహిళలు, ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన చుట్టుపక్కన వాళ్లు ఆసుపత్రిలో చేర్పించారు.

 

ఆడవాళ్లని చూడకుండా దాడి చేయడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బును నిరాకరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారని పాశవిక దాడులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసులు ఉదాసీనంగా ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తప్పు చేసిన పోలీసులను శిక్షించాలని డీజీపీని కోరారు చంద్రబాబు.

 

అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ గూండాలు ఈ దాడులకు పాల్పడుతున్నారని, ఆడవారని చూడకుండా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *