40 మంది సలహాదారులను తొలగించిన ఏపీ ప్రభుత్వం..

Spread the love

ఏపీలో ఎన్నికల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నది.

 

కాగా, బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయనివారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 4 నుంచి తొలగింపు అమల్లోకి వస్తుందంటూ అందులో పేర్కొన్నది.

 

మంత్రుల పేషీల్లోని పీఎస్ లు, ఓఎస్డీలను మాతృశాఖకు పంపుతూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 11 లోగా ఆయా మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్డీలను వారి మాతృశాఖల్లో రిపోర్టు చేయాలంటూ అందులో ఆదేశించింది. ఈ మేరకు జీఏడీ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పేషీల్లోని ఫైల్స్, రికార్డులు, డ్యాక్యుమెంట్స్ ను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందజేయాలని ఆదేశించారు. ఫర్నిచర్, కంప్యూటర్, స్టేషనరీల జాబితాను సమర్పించాలని జీఏడీ ఆదేశించింది. అలాగే పేషీలకు సంబంధించిన నో డ్యూస్ సర్టిఫికెట్లు కూడా తీసుకోవాలంటూ సూచించింది. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫర్నిచర్ వివరాలను సైతం ఇవ్వాలంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

 

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రవిచంద్రను నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీలో మరికొంతమంది అధికారుల నియామకంపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *