ఈనాడు రామోజీ రావు కన్నుమూత..!

Spread the love

ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, ప్రముఖ నిర్మాత రామోజీ రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

 

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 5వ తేదీన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. శుక్రవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై రామోజీ రావుకు కృత్రిమ శ్వాసను అందించారు డాక్టర్లు. వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు.

 

తెలుగునాట మీడియా మొఘల్‌గా ఎదిగారు రామోజీ రావు. ఈనాడు దినపత్రిక, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలతో మీడియా రంగంలో సంచలనం సృష్టించారు. తనదైన ముద్ర వేశారు. తన పేరు మీద దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించారు. ప్రియా పేరుతో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ సెగ్మెంట్‌లోనూ ఆయన అడుగులు వేశారు. అక్కడా విజయవంతం అయ్యారు.

 

నిర్మాతగా టాలీవుడ్‌లో ఎన్నో మరపురాని సినిమాలను నిర్మించారు. తెలుగు, బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. సమాజాన్ని మేలుకొలిపేలా ఆయన సినిమాలు ఉంటాయనే గుర్తింపును పొందారు. మయూరి, ప్రతిఘటన, మౌనపోరాటం వంటి ఎన్నో సందేశాత్మక సినిమాలు వెలవడ్డాయి ఆయన బ్యానర్ నుంచి.

 

రామోజీ రావు మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోన్నారు. రాజకీయ, సినిమా, పారిశ్రామిక రంగాలు విషాదంలో మునిగిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *