డ్రగ్స్, మోరల్ పోలీసింగ్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

Spread the love

విద్యార్థులే డ్రగ్స్‌కు బానిసైతే సమాజం ఏం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్‌తో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమాజంలో పెడదోరణులకు పలు కారణాలున్నాయని వాటిలో మాదక ద్రవ్యాలు కూడా ఒకటని అన్నారు.

 

డ్రగ్స్‌నునిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా డీజీపీ స్థాయి ఉన్నతాధికారితో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. నేర నిర్మూలన కేవలం పోలీసుల వల్లనే కాదని పౌరసమాజం సైతం తోడ్పాడునందించాలని సీఎం సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, వాహనాల క్రమబద్ధీకరణకు ఎన్‌ఎస్ఎస్ వాలంటీర్లు సహకరించడానికి ముందుకు రావడం ఎంతో అభినందించదగిన విషయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

 

పిల్లలను ఇంటర్నెట్‌కి దూరంగా ఉంచాలని, సాంకేతికత వల్ల ఎంత ప్రయోజనం ఉందో సరైన పద్ధతిలో వాడుకోకపోవడం వల్ల అంతకంటే పెద్ద అనర్థాలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల పిల్లలకు మానవీయ విలువలు తెలియడంలేదని, ప్రతి చిన్న విషయానికి మానసిక స్థైర్యం కోల్పోయి కొన్నిసార్లు ఆత్మహత్యలకు సైతం వెనుకాడటంలేదని అన్నారు.

 

యూనిఫాం లేని పోలీసులు ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు అని మోరల్పోలీసింగ్చేయాల్సిన బాధ్యత వారిదేనని సీఎం రేవంత్ పేర్కొన్నారు. విద్యార్థులే డ్రగ్స్‌కు బానిసైతే సమాజం ఏం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను దృఢంగా తీర్చిదిద్దడంలో ఎన్‌ఎస్‌ఎస్ లాంటి కార్యక్రమాలు తోడ్పడుతాయన్నారు.

 

ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అంశాల్లో మాదకద్రవ్యాలు ఒకటని రాష్ట్రం నుంచి వీటిని పారదోలడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ అమలు చేస్తున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల విక్రేతలపై గట్టి నిఘా పెట్టామని ఏదైనా సమాచారం వస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని డీజీపీ జితేందర్ తెలిపారు. డ్రగ్స్ ను అరికట్టడంలో ప్రజల సహకారం అవసరమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *