నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్..?

Spread the love

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.రిమాండ్‌లో జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆ యువతిని తన దగ్గర అసిస్టెంట్‌గా చేరుకున్నారని తెలిసింది. 2020లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు జానీ మాస్టర్ అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో ఒప్పుకున్నారని తెలుస్తోంది. తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు ఆ యువతి వయస్సు 16 సంవత్సరాలే అని పోలీసులు తేల్చారు.

 

గత నాలుగేళ్లుగా బాధితురాలిపై అనేకమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు జానీ మాస్టర్ అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్ లో యువతి ఫిర్యాదు చేసింది.

 

జానీ మాస్టర్ భార్య అయేషా సైతం రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పోలీసులు ఆయన్ను నేరుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరిపల్లిలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *