ఏపీకి పొంచివున్న మరో విపత్తు..!

Spread the love

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి- దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను ముంచెత్తాయి. చెరువులు, కుంటలు వరదనీటితో పోటెత్తాయి. కొత్త నీటితో కళకళలాడుతున్నాయి.

 

ఇదే తరహా పరిస్థితులు అటు తమిళనాడు, కర్ణాటకల్లోనూ నెలకొన్నాయి. తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. అల్పపీడన ప్రభావంతో చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లు అతలాకుతలం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. బెంగళూరులోనూ వర్షాలు దంచికొట్టాయి.

 

మరోసారి అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి ఏపీతో పాటు ఒడిశాలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడతో పాటు ఒడిశాలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కావొచ్చు.

 

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోండటమే దీనికి కారణం. బంగాళాఖాతం మధ్య ప్రాంతం, అండమాన్- నికోబార్ దీవుల సమీపంలో ఈ నెల 20వ తేదీన నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 22వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా మారడానికి అనువైన వాతావరణం నెలకొని ఉందని పేర్కొంది.

 

అది కాస్తా 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారవచ్చనీ స్పష్టం చేసింది. ఆ తరువాత ఈ వాయుగుండం తుఫాన్‌గా మారుతుందా? లేదా? అనేది ఇప్పుడే అంచనా వేయలేమని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర చెప్పారు.

 

దీని ప్రభావం వల్ల ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఒడిశా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. పిడుగులు పడొచ్చని, బలమైన ఈదురుగాలులు వీస్తాయనీ అన్నారు. వర్షాల తీవ్రత ఏపీ ఉత్తర ప్రాంత జిల్లాలపైనా ఉండొచ్చనీ ఆయన పేర్కొన్నారు.

 

మయూర్‌భంజ్, కియాంఝార్, బాలాసోర్, భద్రక్, జైపూర్, కేంద్రపారా, కటక్, జగత్‌సింగ్‌పూర్, ఖుర్దా, పూరీ, గంజాం, గజపతి, రాయగడ, కలహండి, కోరాపూట్, మల్కాన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆ తరువాత వాటి తీవ్రత పెరుగుతుందని అన్నారు.

 

అండమాన్ తీరానికి సమీపంలో ఏర్పడబోయే ఈ అల్పపీడన ప్రభావం ఏపీపైనా ఉంటుందని మృత్యుంజయ్ మొహపాత్ర తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ తరువాత మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *