ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. రెండో విడత లిస్టు పైన చంద్రబాబు మిత్రపక్షాలతో చర్చిస్తున్నారు. దీపావళి లోగా రెండో విడత జాబితా ప్రకటన చేయాలనే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి విడత ప్రకటన తరువాత టీడీపీ లో కొందరు నేతల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో, ఈ సారి మూడు పార్టీల్లోనూ సీట్లు త్యాగం చేసిన వారితో పాటుగా క్రియాశీలకంగా పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
రెండో లిస్టు పై కసరత్తు
ఏపీలో నామినేటెడ్ పోస్టుల రెండో విడత లిస్టు పై కసరత్తు కొనసాగుతోంది. రెండో లిస్టులో మూడు పార్టీల నుంచి 40 మందికి అవకాశం దక్కనుంది. మొదటి దశలో దాదాపు 21 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను చంద్రబాబు ఇచ్చారు. అదే విధంగా రెండో దఫా కూడా దాదాపు 40కి పైగా కార్పొరేషన్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. టీటీడీ బోర్డు, వివిధ దేవాలయాల పాలక మండళ్లు, కుల సంఘాలకు సంబంధించిన ఛైర్మన్ పదవులు ఇస్తారని చెబుతున్నారు. పార్టీ నేతల నుంచి వచ్చిన దరఖాస్తులతో పాటుగా తన దగ్గర ఉన్న ఫీడ్ బ్యాక్ తీసుకుని నిర్ణయం చేస్తున్నారు.
ఆచి తూచి ఎంపిక
పార్టీ అధికారం కోల్పోయిన తరువాత 2019 నుంచి 2024 వరకు కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యత దక్కేలా ఎంపిక ఉంటుందని చెబుతున్నారు. అందులో భాగంగా లిస్టు సిద్దం అయినట్లు తెలుస్తోంది. వడపోత తరువాత ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జనసేన, బీజేపీ నుంచి లిస్టులు చంద్రబాబుకు అందాయి. వీరి పైన సర్వే టీమ్స్, బ్యాక్ ఆఫీస్ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా తుది ఎంపిక చేస్తున్నారు. ఈ నెల 28 లేదా 29 తేదీల్లో రెండో విడత నామినేటెడ్ పదవులు ప్రకటిస్తారని సమాచారం.
తుది జాబితా సిద్దం
మొదటి లిస్ట్ లో మూడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు జనసేనకు, ఒక కార్పొరేషన్ ఛైర్మన్ (20 సూత్రాల ఆర్థిక సంఘం) పదవిని బీజేపీకి కేటాయించారు. అదే దామాషా పద్దతిలో రెండో విడతలోనూ ఆ రెండు పార్టీలకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీల దగ్గరి నుంచి పేర్లను కూడా సేకరించారు. ఇందులో పట్టాభి, దేవినేని ఉమా, కొమ్మాలపాటి శ్రీధర్, బుద్దా వెంకన్న లాంటి వారికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జనసేన, బీజేపీ నుంచి సైతం ఆ పార్టీల నేతలు పేర్లు ఇప్పటికే సిఫార్సు చేసారు.