మేడారం మినీ జాతర తేదీలు ఖరారు..!

Spread the love

తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2025 ఫిబ్రవరిలో 12 నుంచి 15 తేదీ వరకు నాలుగు రోజులు మినీ జాతరను నిర్వహించనున్నట్లు మేడారం పూజారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మేరకు పూజారులు ఆలయ ఈవోకు ఆహ్వాన పత్రం పంపారు.

 

మినీ మేడారం జాతరకు కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతుంటాయి. గద్దెల ముందు పొర్లు దండాలు పెట్టి బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

 

 

ఏడాది ఫిబ్రవరి 21న మేడారం మహా జాతరను 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వచ్చే ఏడాది మినీ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందుల కలగకుండా తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు, రవాణా, భద్రత ఏర్పాట్లు చేయనుంది.

 

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క- సారలమ్మ జాతర రికార్డుల్లోకెక్కింది. మాఘ మాసంలో పౌర్ణమి రోజుల్లో ప్రతి రెండేళ్లోకోసారి ఈ మహా జన జాతర జరుగుతుంది. మండ మెలిగే పండుగతో మొదలుకొని వన దేవతల ఆగమనంతో అసలైన మేడారం మహా జాతర ప్రారంభమవుతుంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మహా జాతరకు కోటి మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకుంటారు.

 

కాగా, కాకతీయ సైన్యంలోని కొందరు గిరిపుత్రులను వేధిస్తుంటే.. వారికి వ్యతిరకంగా పోరాటం చేశారు సమ్మక్క, సారలమ్మ. కత్తిపట్టి కదనరంగంలో దూకి వీర మరణం పొందారు గిరిజన ఆడబిడ్డలు సమ్మక్క-సారలమ్మ. వందల ఏళ్లు దాటినా వారి త్యాగానికి నీరాజనాలు పలుకుతూ దేవతలుగా పూజిస్తూ మేడారంలో జాతర చేస్తున్నారు. 1944 వరకూ ఆదివాసీ గిరిజనులకే పరిమితమైనా ఆ తర్వాత మహా జన జాతరగా మారిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *