రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగాలేవన్నారు. ఒక దశలో తాను రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో ఆయన ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, రోజూ తమకు మార్గనిర్దేశం చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. 2025 తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి విస్తృతంగా వస్తారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నారని చెప్పారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి కేసీఆర్ సమయం ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతి కారణంగానే ఓడిపోయామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ప్రజల్లో తప్పుడు ఆశలు రేకెత్తించాయన్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి అంటూ ఏమీ లేదన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు.
ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండేలా చేస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంతేగాక, ప్రస్తుత రాజకీయాల్లో కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదన్నారు. రాజకీయాల్లోకి వారిని ఎందుకు లాగుతున్నారో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ చేయలేదని చెప్పుకొచ్చారు.
తన 18 ఏళ్ల ప్రజా జీవితంలో తన కుటుంబసభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారని కేటీఆర్ తెలిపారు. ఒక దశలో తాను రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని.. కానీ, ప్రజల కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. నెటిజన్లు అడిగిన ఇతర అంశాలపైనా కేటీఆర్ సమాధానమిచ్చారు. సుమారు గంటన్నరపాటు నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ జవాబిచ్చారు.