ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.ఆయనతో పాటు మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి కూడా నోటీసులు పంపింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన నిందితులు జైల్లో ఉన్నారు. వీరిని నిందితుల్లో ఒకరైన అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు, డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి అప్రూవర్ గా మారిన దస్తగిరిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా అవినాష్ రెడ్డికి గతంలో మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ స్పందించి నోటీసులు పంపింది.