ఏపీలో ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ మరో ఎన్నికల హామీ నిలబెట్టుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఓ నిర్ణయానికి తాము అధికారంలోకి రాగానే చెక్ పెడతామని హామీ ఇచ్చిన కూటమి.. అన్నట్లుగానే దాన్ని అమలు చేసింది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన ఆ నిర్ణయానికి ఇవాళ అసెంబ్లీలో సైతం ఆమోద ముద్ర వేసింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది ప్రజలకు ఊరట కలగబోతోంది.
రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నిధుల కోసం చెత్త పన్ను విధించింది. ప్రభుత్వ సామాజిక బాధ్యత అయిన పారిశుధ్య నిర్వహణకు పన్ను వసూలు చేయడంతో జనం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయినా పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్లింది. ఈ దశలో కూటమి పార్టీలు తమను గెలిపిస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే అధికారం చేపట్టాక చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అనంతరం కేబినెట్లో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఇప్పుడు అసెంబ్లీలోనూ చట్ట సవరణ చేశారు.
చెత్త పన్ను రద్దు చేస్తూ సవరణ బిల్లును అసెంబ్లీలో మున్సిపల్ మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వంలో చెత్త పన్ను వసూలు,కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా చేసిన వ్యవహారంపై విచారణ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రకటించారు. గత ప్రభుత్వం చెత్త సేకరించడానికి పన్ను విధించిందని, సర్వీస్ ప్రొవైడర్లు ద్వారా వాహనాలు ఏర్పాటు చేసి 40 మున్సిపాలిటీల్లో పన్నులు వసూలు చేసిందని మంత్రి తెలిపారు. చెత్తను సేకరించడానికి నెలకి 51,641రూపాయల నుంచి 62,964 రూపాయల వరకూ చెల్లించేదన్నారు.
2021 లో నవంబర్ నుంచి చెత్త పన్ను వసూల్లు ప్రారంభించారని, నెలకి గృహాలకు 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు వసూలు చేశారని, వాణిజ్య సముదాయాలకు నెలకు 100 నుంచి 10,000 వరకు వసూలు చేసారని తెలిపారు. ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్నవారికి కూడా చెత్త పన్ను సంవత్సరానికి 356 రూపాయలు వేశారన్నారు. 2021 నవంబర్ నుంచి జూలై వరకు 325 కోట్లు బిల్లు అయితే 249 కోట్లు చెల్లించారన్నారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ట్యాక్స్ లు పెంచలేదని, గత ప్రభుత్వం వేసిన చెత్త పన్ను పైన కొన్ని జిల్లాలు మహిళ ధర్నాలు చేశారని తెలిపారు.
అందుకే చెత్త పన్ను రద్దు చేసేందుకు సవరణ బిల్లును తెచ్చామన్నారు.