వాలంటీర్ల పై ఏపీ సర్కార్ సస్పెన్స్..

Spread the love

ఏపీలో చేసిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించటం తో పాటుగా నెలకు రూ 10 వేలు వేతనం ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్నా.. ఇంకా వాలంటీర్ల అంశం పైన స్పష్టత ఇవ్వలేదు. వైసీపీ హయాంలోనే వారి కొనసాగింపు పైన అధికారిక ఉత్తర్వులు లేవని చెబుతున్నారు. అయితే, కేబినెట్ లో వాలంటీర్ల అంశం పైన చర్చ జరిగినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమయంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 

వాలంటీర్ల పై సస్పెన్స్

వైసీపీ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారింది. పథకాలు, సర్టిఫికెట్స్ జారీతో పాటుగా సచివాలయ సేవలు ప్రజలకు అందించటం లో కీలక భూమిక పోషించారు. కరోనా వేళ వాలంటీర్ల సేవలకు గుర్తింపు లభించింది. ఇక, ఎన్నికల సమయంలో వాలంటీర్ల పైన నాడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను కోడ్ నేపథ్యంలో పక్కన పెట్టారు. దీంతో, రాజకీయంగా వాలంటీర్ల అంశం ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారింది. ఆ సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ 10 వేలు ఇచ్చి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

 

ప్రభుత్వ ఆలోచన ఏంటి

ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల సేవలు కొనసాగింపు .. వారికి స్కిల్ శిక్షణ వంటి అంశాల పైన చర్చించారు. పూర్తి నివేదిక కోరటంతో ఆ చర్చ అంతటితో ఆగిపోయింది. ఆ తరువాత అసలు వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని.. జగన్ హయాంలోనే వారి సేవలను కొనసాగిస్తూ నిర్ణయం జరగలేదని ప్రభుత్వంలోని ముఖ్యులు వెల్లడించారు. కానీ, విజయవాడ వరదల సమయంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్ల సేవలను వినియోగించు కొన్నారు. కాగా, వాలంటీర్లు ఇప్పటికే ప్రభుత్వానికి అభ్యర్ధన చేసారు. కానీ, ప్రభుత్వం నుంచి వారిని ఇక తొలిగించినట్లేనా .. లేక, అవకాశం ఇస్తారా అనేది మాత్రం తేల్చటం లేదు.

 

వాలంటీర్ల నిరసనలు

ఇక, వైసీపీ హయాంలో వాలంటీర్ల తో ప్రతీ నెలా ఇంటింటికి అందించిన పెన్షన్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తోంది. వాలంటీర్ల ప్రస్తావన కూడా రావటం లేదు. దీంతో, వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు నిరసనలకు సిద్దమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగుతాయని వాలంటీర్ల సంఘాల నేతలు వెల్లడించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల్లో వితని పత్రాలు ఇవ్వనున్నారు. రేపు మోకాళ్ల మీద కూర్చొన భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే.. మరి ప్రభుత్వం వీరి నిరసనల వేళ స్పందిస్తుందా.. నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తి గా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *