తిరుమల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తిరుపతి లో తొక్కిసలాట వేళ తిరుమల లో చోటు చేసుకుంటున్న పరిణామాల పై చంద్రబాబు, పవన్ ఆగ్రహంగా ఉన్నారు. టీటీడీలో పూర్తి స్థాయిలో మార్పులు జరగాలని పవన్ డిమాండ్ చేసారు. ఈవో, ఏఈవో పైన సీరియస్ అయ్యారు. చంద్రబాబు సమక్షంలోనే ఛైర్మన్ – ఈవో వాగ్వాదం ను సీఎం తీవ్రంగా పరిగణించారు. దీంతో, ఈ రోజు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు పూర్తయిన తరువాత ఈవో..ఏఈవో మార్పు ఖాయమని తెలుస్తోంది. ఈవోగా కీలక అధికారి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
టీటీడీ ప్రక్షాళన
కోట్లాది మంది భక్తులు విశ్వసించే తిరుమల బాధ్యత టీటీడీ పై ఉంది. టీటీడీలో ఛైర్మన్, ఈవో, ఏఈవో ది కీలక పాత్ర. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏరి కోరి ఈ మూడు స్థానాల్లో నియామకాలు జరిగాయి. కానీ, ఏడు నెలల కాలంలోనే ఈ ముగ్గురి మధ్య సమన్వయం లేకపోవటంతో పాటుగా ఎవరికి వారే తామే నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనే విధంగా వ్యవహరిస్తున్న శైలి వివాదాస్పదంగా మారింది. తిరుపతి తొక్కిసలాట ఘటన పై చంద్రబాబు సమీక్షలోనే ఛైర్మన్ , ఈవో ఏకవచనంతో వాగ్వాదానికి దిగటాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అదే సమయంలో పవన్ సైతం ఈవో, ఏఈవో మధ్య సమన్వయం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
చంద్రబాబు – పవన్ సీరియస్
తాజా ఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ స్పష్టం చేసారు. తాజా ఘటన పైన పవన్ భక్తులకు క్షమాపణ చెప్పారు. లక్షలాది భక్తులు హాజరయ్యే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పైన 15 సమావేశాలు జరగ్గా.. వాటిల్లో ఛైర్మన్ – ఈవో కలిసి ఒకే సారి పాల్గొనటం ద్వారా ఏ స్థాయిలో వీరి మధ్య గ్యాప్ ఉందనేది స్పష్టం అవుతోంది. ఈవో శ్యామలరావు, చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎవరికి వారు తామదే నిర్ణయాధికారం అనే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. కొద్ది రోజుల క్రితం ఛైర్మన్ నాయుడు సీఎం చంద్రబాబు ను కలిసి ఈవో పై ఫిర్యాదులు చేసారు. దీంతో, ఈవోను పిలిపించి చంద్రబాబు కలిసి పని చేసుకోవాలని.. సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
కీలక కసరత్తు
కానీ, వీరి మధ్య సయోధ్య లేదని తాజాగా చంద్రబాబు సమీక్షలో స్పష్టమైంది. సీఎం సమక్షంలోనే వారిద్దరూ తీవ్రస్థాయిలో మాటల ఘర్షణకు దిగడం కలకలం రేపింది. దీంతో టీటీడీ వ్యవహారాలను చక్కదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏఈవో వెంకయ్య చౌదరి పైనా ఫిర్యాదులు ఉన్నాయి. పవన్ సైతం వీరి విషయంలో గుర్రుగా ఉన్నారు. దీంతో, ప్రస్తుతం సీఎంఓలో పని చేస్తున్న కీలక అధికారికి టీటీడీ ఈవోగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. శ్యామలారావును తిరిగి గతం లో పని చేసిన శాఖకు పంపే ఛాన్స్ ఉందని సమాచారం. ఏఈవో స్థానంలో ప్రభుత్వంలోని ముఖ్య శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్న యువ అధికారి నియామకం పైన పరిశీలన చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు టీటీడీ ప్రక్షాళనలో భాగంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.