మహాకుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ల వద్ద ఒక్క సారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో, భక్తుల్లో ఆందోళన మొదలైంది. ఆందోళనతో భక్తులు అరుపులు.. పరుగులతో ఆ ప్రాంతం అంతా గందరగోళం గా మారింది. వెంటనే ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. మంటలను అదుపులోకి తెచ్చారు. పెద్ద సంఖ్యలో టెంట్లు దహనం అయ్యాయి. భక్తులు అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు.
కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్న కుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్ లోని తులసి మార్గ్ సెక్టార్ 19 లో మంటలు చెలరేగాయి. వారణాసిలోని వివేకానంద సేవా సమితి టెంట్లో భోజనం వండుతుండగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఇది అధికారికంగా ధృవీకరించలేదు. గ్యాస్ సిలిండర్లలో పేలుళ్లు సంభవించడంతో టెంట్లను మంటలు చుట్టుముట్టి పెద్ద ఎత్తున నల్లటి పొగతో ఎగసిపడ్డాయి. దాదాపుగా 20 నుంచి 25 టెంట్లు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. ఒక్క సారిగా మంటలు ఎగిసిపడటంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఎవరికీ ఎలాంటి నష్టమూ జరగలేదు.
ఈ నెల 13న ప్రారంభమైన మహాకుంభ మేళా కు ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 8 కోట్ల మంది వరకు పుణ్య స్నానాలు చేసినట్లు తెలుస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసారు. భక్తులు, స్వామిజీల కోసం ప్రత్యేకంగా టెంట్లు కేటాయించారు. ప్రస్తుతం అక్కడే సిలిండర్ పేలుడుతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మంటలు అదుపులోకి వచ్చాయని జిల్లా అధికారులు ప్రకటించారు.