ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. పార్టీలను ముఖ్య నేతలు వీడటం.. మరో పార్టీలో చేరటం కొనసాగుతోంది. కూటమి పార్టీలు ప్రస్తుతం వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ జర్నీ ఆసక్తి కరంగా మారుతోంది. ఐపీఎల్ స్టార్ రాయుడు రాజకీయంగా తొలుత వైసీపీ వైపు ఆసక్తి చూపారు. ఆ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం వేళ.. పవన్ వైపు నిలిచారు. జనసేన స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ ప్రకటించింది. కానీ, ఇప్పుడు మరో సారి తన నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
రాయుడు ఏ పార్టీ..?
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ పైన స్పష్టత కనిపించటం లేదు. క్రికెట్ లోనూ అంబటి అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. సీఎస్కీ తరపున ఐపీఎల్ లో అంబటి స్పెషల్ ప్లేయర్ గా నిలిచారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ నిర్ణయాలను ప్రశంసించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ, తాను ఆశించిన గుంటూరు ఎంపీగా అవకాశం దక్కకపోవటంతో రూటు మార్చారు. పవన్ అన్నకు సీఎం చేయటానికి సిద్దం అంటూ ఎన్నికల ముందు అంబటి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
జనసేన స్టార్ క్యాంపెయినర్ గా
ఆ తరువాత జనసేనాని పవన్ తో భేటీ అయ్యారు. ఎన్నికల్లో జనసేన తమ పార్టీ స్టార్ క్యాంపెయి నర్ గా అంబటి రాయుడును ప్రకటించింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సూచనల మేరకే పవన్‌తో భేటీ అయినట్లు ప్రకటించిన అంబటి.. పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడిం చారు. ఎన్నికలు అయిన తరువాత అంబటి రాజకీయంగా ఎక్కడా యాక్టివ్ గా కనిపించ లేదు. అదే సమయంలో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక, ఇప్పుడు అంబటి రాయుడు బీజేపీ లో చేరేలా రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంబటి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
బీజేపీ వైపు చూపు..!
విశాఖలో జరిగిన ఏబీవీపీ సభల్లో అంబటి రాయుడు పాల్గొన్నారు. బీజేపీ పైన తన అభిమానం చాటుకున్నారు. కీలక వ్యాఖ్యలు చేసారు. దేశం కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీ అంటూ చెప్పు కొచ్చారు. పలువురు ప్రముఖ క్రికెటర్లు బీజేపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు అంబటి రాయుడు సైతం అదే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వీడి జనసేనకు మద్దతుగా నిలిచిన అంబటి రాయుడు.. ఇప్పుడు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తాజా సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, ఎన్నికల ముందు తమ స్టార్ క్యాంపెయినర్ గా అవకాశం ఇచ్చిన జనసేన కాదని.. ఇప్పుడు అంబటి రాయుడు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.