ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్ధులకు సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీ ప్రకారం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే మరో హామీని కూడా నిలబెట్టుకోనుందని తెలుస్తోంది.
తల్లికి వందనం.. ఈ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా దీన్ని అమలు చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15000 అందిస్తామని సీఎం వెల్లడించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలందరికీ రూ. 15000 అందించడం జరుగుతుందని.. పథకంలో భాగంగా ఎంత మంది పిల్లలు ఇంట్లో ఉన్నా వారందరికీ ఈ రూ.15000 వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఈ పథకం విద్యార్థుల కోసం వారి చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించబడిందని వివరించారు. విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్స్, చదువు సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని తెలిపారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది. కానీ ఆ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అందించబడింది. ప్రస్తుతం తల్లికి వందనం పథకంతో విద్యార్థుల అందరికి రూ. 15000 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం వల్ల ఆర్థిక కారణాలతో విద్యార్ధులు చదువు మానేసే పరిస్థితులు ఇక ఉండవని కూటమి నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలు అమలులో ఉన్నాయి. ఆ పథకాల్లో పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు ముఖ్యంగా ఉన్నాయి. ఈ పథకాలు ప్రజలకు మరింత సహాయం చేస్తుండగా తల్లికి వందనం పథకం కూడా ఇప్పుడు అమలు కానుందని కూటమి పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.