ఏపీలో ఆస్తిపన్ను బకాయిల వసూళ్ల కోసం ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బకాయిల వసూళ్ల కోసం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు వడ్డీలో 50 శాతం మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. దీంతో ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించడానికి మరో అవకాశం లభించినట్లయింది.
ఈ ఆర్ధిక సంవత్సరం ఆస్తిపన్ను బకాయిల చెల్లింపు కోసం ఈ నెలాఖరు వరకూ అంటే 31వ తేదీ వరకూ గడువు ఉంది. ఈలోపు చెల్లిస్తే 50 శాతం వడ్డీ రాయితీ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ 31వ తేదీ వరకే వర్తిస్తుంది. కానీ ఈ నెల 30, 31 తేదీల్లో వరుసగా ఉగాది, రంజాన్ పండుగలు వచ్చాయి. అలాగే 30వ తేదీ ఆదివారం కూడా. దీంతో ఈ రెండు రోజుల్లో ఆస్తిపన్ను చెల్లించేందుకు కౌంటర్లు పనిచేయవు. కానీ ప్రభుత్వం పన్ను వసూళ్ల కోసం ఈ రెండు తేదీల్లోనూ కౌంటర్లు తెరిచి ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 30,31 తేదీల్లో కూడా పన్నుల చెల్లింపు కౌంటర్లు పనిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు వీలుగా మున్సిపల్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 50 శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం.. మార్చి 31 వరకే గడువు ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
ఈ రెండు రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ పనిచేయనున్న కౌంటర్లు పనిచేస్తాయని పేర్కొంది. పండుగలు కావడం తో తగిన సిబ్బంది ఉండేలా చూడాలని కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆన్ లైన్లోనూ పన్ను చెల్లించవచ్చని తెలిపింది.