నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు మహబూబాబాద్ జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్

Spread the love

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మహబూబాబాద్ జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్

మహబూబాబాద్ జిల్లా ప్రతినిది జులై 10 (సంచలన వార్త)
రిఫ్లెక్టర్లు (రేడియం స్టిక్కర్లు) ప్రతి వాహనానికి తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ రోడ్డు ప్రమాదాల నివారణ, వాహన భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రతి వాహనానికి ప్రభుత్వం నిర్దేశించిన రిఫ్లెక్టర్లు (రేడియం స్టిక్కర్లు) తప్పనిసరిగా అమర్చాలని మహబూబాబాద్ జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిబంధనలను జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రతి వాహనం ముందు భాగంలో వైట్ కలర్ రిఫ్లెక్టర్లు (రేడియం స్టిక్కర్లు), వెనుక భాగంలో రెడ్ కలర్ రిఫ్లెక్టర్లు (రేడియం స్టిక్కర్లు), రెండు వైపులా ఆరెంజ్ లేదా పసుపు రంగు రిఫ్లెక్టర్లు (రేడియం స్టిక్కర్లు) తప్పనిసరిగా అమర్చాలని సూచించారు. ముఖ్యంగా ట్రాక్టర్లకు అనుసంధానించే ట్రైలర్లు (తొట్టీలు) వెనుక భాగంలో రెడ్ కలర్ రిఫ్లెక్టర్లు (రేడియం స్టిక్కర్లు) ఏర్పాటు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 20 నుంచి QR ఆధారిత మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS) ద్వారా ధృవీకరించిన రిఫ్లెక్టర్ (రేడియం స్టిక్కర్) స్టిక్కర్లను మాత్రమే వినియోగించాలని ఆదేశించిందన్నారు. రాత్రి వేళలు, వర్షాకాలం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ రిఫ్లెక్టర్లు వాహనాలను దూరం నుంచే స్పష్టంగా గుర్తించేలా చేసి రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.మోటారు వాహనాల నియమాలు–1989లోని రూల్–104 ప్రకారం రిఫ్లెక్టర్లు (రేడియం స్టిక్కర్లు) లేని వాహనాలు ప్రమాదాలకు కారణమైతే సంబంధిత వాహన యజమాని, డ్రైవర్‌పై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు రవాణా శాఖ అధికారులు జరిమానాలు విధిస్తారని చెప్పారు. అదనంగా డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలల వరకు సస్పెండ్ చేయడంతో పాటు నిబంధనల ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్ష, రూ.5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్ల అన్ని వాహన యజమానులు తమ వాహనాలకు ప్రభుత్వం ఆమోదించిన QR ఆధారిత MIS ధృవీకరించిన రిఫ్లెక్టర్లు (రేడియం స్టిక్కర్లు) తప్పనిసరిగా అమర్చడంతో పాటు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండి రోడ్డు భద్రతకు సహకరించాలని జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.