ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి* *జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

Spread the love

*ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి*

*జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

మంచిర్యాల బ్యూరో
జూన్ 25,(సంచలన వార్త);

ప్రజా ఆరోగ్యం దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, రిజిస్టర్లు, ల్యాబ్, పరిసరాలను పరిశీలించి అధిక శాతం నమోదు అవుతున్న వ్యాధులు, అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య రంగ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను ఆధునికరిస్తూ, ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చి ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలం అయినందున వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది నిధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యా రంగంలో ఆచరణాత్మక మార్పులను తీసుకువస్తూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులకు కార్యక్రమం నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయడం, తిరిగి సేకరించడం, వివరాల నమోదు అంశాలలో జాగ్రత్త వహించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించి తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.