తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వ పాలకులు అధికార దుర్వినియోగం చేశారు. కీలకమైన ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత సమాచారాన్ని, రాజకీయ సమాచారాన్ని సేకరించి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.
అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురు బడా పోలీసు బాస్‌లను అరెస్ట్ చేశారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు.
అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అటు ఈ కేసులో పోలీసులు ఆరుగురిని నిందితుల జాబితాలో చేర్చారు.
ఈ కేసులోని నిందితులు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ల సందర్భంగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. వీరి బెయిల్ పిటిషన్ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కీలక వాదనలు చేశారు. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ కూడా.. ఇంకా విచారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని.. కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దని పీపీ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పను బుధవారానికి రిజర్వ్ చేసింది.