కేఆర్ పురం ఐటీడీఏలో గిరిజన యువత కోసం ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.

Spread the love

కేఆర్ పురం ఐటీడీఏలో గిరిజన యువత కోసం ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
ఏలూరు జిల్లా ప్రతినిది మార్చి 16 (సంచలన వార్త)

కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించి ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్‌ను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రైవింగ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన వాహనాలను పరిశీలించి, శిక్షణ పొందనున్న గిరిజన యువతతో ఎమ్మెల్యే మాట్లాడి వారికి అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని యువతకు సరైన శిక్షణ, మార్గదర్శనం అందితే వారు ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలరని అన్నారు. గిరిజన యువత నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
యూత్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం వల్ల యువతకు భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
డ్రైవింగ్ శిక్షణ పూర్తిచేసుకున్న యువత తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైతే వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్న పథకాలపై కూడా అధికారులు వారికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గిరిజన యువత ఆర్థికంగా బలపడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.అలాగే గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. యువత తమ ప్రతిభను చాటుకుని సమాజంలో మంచి స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు.
ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో రాముల నాయక్, వైటీసీ మేనేజర్ రాజు, జనసేన మండల అధ్యక్షుడు మెట్ట బుచ్చిరాజు, గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా నాయకురాలు బొరగం వెంకటలక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ రామకృష్ణ, ఆర్టీవో అధికారులు, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గిరిజన యువత పాల్గొన్నారు.