“వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ.
“సజావుగా సాగేలా విస్తృత తనిఖీలు.
– ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.
*ఎన్‌టీఆర్ జిల్లా ప్రతినిది , మార్చి 16 2026 (సంచలన వార్త)
జిల్లాలో వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని.. విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు.
సోమవారం జేసీ ఇలక్కియ అధికారులతో కలిసి విజయవాడ వన్ టౌన్ సుమన్ గ్యాస్ ఏజెన్సీ, గుణదలలోని అహ్మద్ గ్యాస్ ఏజెన్సీ, నున్నలోని మారుతి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్ డేటాను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అవసరం మేరకు ఉన్నాయని, సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గ్యాస్ కొరతపై ఎలాంటి అపోహలకు లోనుకావద్దని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు కూడా వినియోగదారులకు నిర్దేశ సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తినట్లయితే లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఇందుకోసం 9154970454 ఫోన్ నంబర్‌తో కంట్రోల్ రూం అందుబాటులో ఉంచినట్లు జాయింట్ కలెక్టర్ ఇలక్కియ చెప్పారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)